సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలు ఆస్పత్రికి రాలేదని ఓ గర్భిణీకి నర్సులు కాన్పు చేశారు. ఈ కాన్పు వికటించడంతో నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన గర్భిణీ మానస కాన్పుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. మంగళవారం తెల్లవారుజామున మానసకు నొప్పులు రావడం మొదలైంది. దీంతో వెంటనే ఆస్పత్రి సిబ్బంది వైద్యురాలికి సమాచారం అందించారు. అయితే వైద్యురాలు ఆస్పత్రికి రాలేనని చెప్పడంతో నర్సులే నిర్లక్ష్యంగా కాన్పు చేసి బిడ్డను బలి తీసుకున్నారు. ఆ వెంటనే శిశువుకు ప్రమాదం ఉందని, ప్రైవేట్ ఆస్పత్రికి త్వరగా తీసుకెళ్లాలని హడావుడి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యులు అందుబాటులో లేకపోవడం, అంబులెన్స్ డ్రైవర్ ప్రైవేట్ ఆస్పత్రికి రానని చెప్పడంతో నవజాత శిశువు మృతి చెందింది. నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంతో తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.