Telangana : ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల న్యూడ్ కాల్.. ఆన్సర్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే.?

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది.

By Knakam Karthik  Published on  5 March 2025 12:44 PM IST
Telangana : ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల న్యూడ్ కాల్.. ఆన్సర్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే.?

సైబర్ నేరస్థులు ఏకంగా ఓ ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో వీడియోను కార్యకర్తలకు పంపించారు. నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..ఇలా ఉన్నాయి.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. ఆయన ఫోన్ కు వీడియో కాల్ వచ్చింది.ఆన్సర్ చేయగానే ఓ అమ్మాయి న్యూడ్ గా కనిపించడంతో ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశారు. అప్పటికే వీడియో రికార్డ్ చేసిన దుండగులు.. ఆ క్లిప్ ను ఎమ్మెల్యేకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ హెచ్చరికలను ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టించుకోలేదు. దీంతో సైబర్ నేరస్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులకు ఆ వీడియో క్లిప్ ను పంపించారు. కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో అవాక్కయిన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ వీడియో చూసిన వెంటనే సదరు నేతలు, కార్యకర్తలు వేముల వీరేశానికి ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసుల సలహాలతో సైబర్‌ నేరగాళ్ల నంబర్‌ను బ్లాక్‌ చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. కాగా మధ్యప్రదేశ్‌ నుంచి ఈ వీడియో కాల్ వచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సైబర్‌ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేముల సూచించారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ రింగ్ టోన్ ను పెట్టారని తెలిపారు.

Next Story