NTR 100th birth anniversary: ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు
By అంజి Published on 28 May 2023 12:15 PM ISTNTR 100th birth anniversary: ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ , నందమూరి రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. తన తండ్రి లెజెండరీ యాక్టర్‌గానే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, మహిళలకు ఆస్తి హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్‌దేనని బాలకృష్ణ అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులర్పించిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తన ప్రకటనలో ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ అపారమైన ప్రతిభతో చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించారని, రాజకీయాల్లో కూడా రాణించారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి స్త్రీలకు ఆస్తి హక్కులు, పేదలకు కిలో బియ్యం రూ.2 చొప్పున వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఢిల్లీ పాలిటిక్స్‌లో తెలుగువాడికి గుర్తింపు లేకుండా పోతున్న తరుణంలో ఎన్టీఆర్ ఓ ఆశాకిరణంగా వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ఆ మహనీయుడికి తన తరుపున నివాళులర్పిస్తున్నానని పవన్ అన్నారు.
‘నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం’ అని ట్వీట్ చేశారు చిరంజీవి.
పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా హనుమకొండ పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నందమూరి తారకరామరావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.