తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్దం అయ్యారు. జాతీయ రాజకీయ పార్టీ పేరును ప్రకటించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. దసరా రోజు అక్టోబర్ 5న పార్టీ పేరును వెల్లడించనున్నారు. పార్టీ ఎలా ఉండబోతుంది, జెండా, అజెండా, కార్యాచరణ లాంటి అంశాలపై అప్పుడే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక యూకే ఎన్నారైలు మాత్రం కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్‌కి మద్దతుగా నినాదాలు చేశారు.
యూకేలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలని కోరారు. భారతదేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తం కావాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అని ఎన్నారైలు అన్నారు.
`దేశ్‌కీ నేత కేసీఆర్` అంటూ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.