నిరుద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు మంత్రి దామోదర గుడ్‌న్యూస్ చెప్పారు. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు.
By అంజి
నిరుద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు
హైదరాబాద్: నిరుద్యోగులకు మంత్రి దామోదర గుడ్‌న్యూస్ చెప్పారు. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఏప్రిల్, మే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. 600 ప్రొఫెసర్, 2900 అసిస్టెంట్ ప్రొఫెసర్, 332 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 2,077 ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని, త్వరలో 195 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.
మరో 6,268 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ 1284, ఎంపీహెచ్‌ఏ 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్ 2322, 46 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోందని మంత్రి దామోదర వెల్లడించారు. అటు రాష్ట్రంలో వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా హెచ్ ఆర్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, శానిటేషన్ లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు.