ఫ్యూచర్ సిటీలో 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం': సీఎం రేవంత్
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’...
By - అంజి |
ఫ్యూచర్ సిటీలో 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం': సీఎం రేవంత్
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ‘అనుబంధ భవన సముదాయం’ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు, సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం తెలంగాణ - నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ‘సంస్కృతుల సంగమం – సమృద్ధికి సోపానం’ పేరుతో ఉత్సవాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, వారి సతీమణి సుధా దేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి “నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని” తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి గౌరవ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాయకత్వం వహించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాలలో దేశానికి మరింతగా తోడ్పాటు అందిస్తున్నాయి.
అస్సోం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు అనుసంధాన కేంద్రంలో అవసరమైన హాస్టల్ సౌకర్యం, ఆహారం, కళలు, చేతి వృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలుగా ఈ భవనాలు పని చేస్తాయన్నారు.
త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బలమైన సంబంధాలను కలిగి ఉన్నాం.
తెలంగాణ - ఈశాన్య రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి, ప్రజల మధ్య సంస్కృతుల పరస్పర మార్పిడికి ఈ ఉత్సవాలు నాంది మాత్రమే. "తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్" టెక్నో కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. ఈ ఉత్సవాలు ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణకు మధ్యన ఉన్న ఏకత్వ స్ఫూర్తిని చాటుతోంది.
ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిది. హైదరాబాద్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్, క్రీడల వంటి అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి ధన్యవాదాలు.
హైదరాబాద్, తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా చైనా +1 దేశాల కోసం అన్వేషణలో ఉన్నాయి. తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, జీసీసీ, డేటా సెంటర్స్, హెల్త్‌కేర్ అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం.
ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళికలతో డిసెంబర్ 8, 9 వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న #TelanganaRisingGlobalSummit కు గవర్నర్ గారి నుంచి సంపూర్ణ సహకారం, మద్దతును కోరుతున్నాం.
తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి తెలంగాణ - నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధుల సహకారం కావాలి..” అని ముఖ్యమంత్రి అన్నారు.