బీజేపీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తాం: కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా పెంచుతామని జి కిషన్‌రెడ్డి స్పష్టం అన్నారు.

By అంజి  Published on  30 Oct 2023 8:00 AM IST
BJP, Kishan Reddy, Minority reservation, Telangana Polls

బీజేపీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తాం: కిషన్ రెడ్డి 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా పెంచుతామని తెలంగాణ బీజేపీ చీఫ్‌ జి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధినేత జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సహా పలువురు కేంద్ర మంత్రుల ర్యాలీలతో నవంబర్ 3 నుంచి పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తామని బీజేపీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, సామాజిక విప్లవమని అన్నారు.

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మోదీ ఈ దేశానికి ప్రధానిగా ఉండి దేశానికి గొప్ప సేవలందిస్తున్నారని, వివిధ వర్గాల ప్రజలు తమ పార్టీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణకు దళిత నేతను సీఎం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చి వెనక్కి తగ్గారని ఆరోపించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌, దాని నేతలకు లేదని కిషన్‌ రెడ్డి అన్నారు.

Next Story