తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్.. హెల్త్ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారంటే..?

No lockdown or night curfew in Telangana.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2022 5:15 AM GMT
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్.. హెల్త్ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారంటే..?

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో రాత్రి క‌ర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు విధించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో జ‌న‌వ‌రి చివ‌రి వారం నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ లేదా రాత్రి క‌ర్ఫ్యూని విధించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిపై ప్ర‌జారోగ్య‌శాఖ‌ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు స్పందించారు. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోరాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండ‌బోద‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని తాము గ‌తంలోనే చెప్పామ‌ని.. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వీటిపై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌న్నారు. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌డం థ‌ర్డ్ వేవ్‌కు సంకేత‌మ‌ని చెప్పారు. అయితే.. ఆందోళన చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. తొలి రెండు వేవ్‌ల్లో నేర్చుకున్న పాఠాల‌తో మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పారు. వ‌చ్చే రెండు నుంచి మూడు వారాలు చాలా కీల‌క‌మ‌న్నారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందిలో లక్షణాలే కనిపించడం లేదని.. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. మాస్కు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, వ్యాక్సిన్ తీసుకోవ‌డం ద్వారా క‌రోనా నుంచి ర‌క్షించుకోవ‌చ్చున‌ని తెలిపారు.

ఇక రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారు 22.78 లక్ష‌ల మంది ఉన్న‌ట్లు చెప్పారు. తొలి రోజున 24,240 మంది టీకాలు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1014 కేంద్రాల్లో చిన్నారుల‌కు టీకాలు వేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా 12 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌రిధిలో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల‌ని.. మిగిలిన ప్రాంతాల్లో నేరుగా వెళ్లి టీకాలు తీసుకోవ‌చ్చున‌న్నారు. వచ్చే గురువారం లేదా శుక్రవారం నుంచి కార్పొరేషన్లలోనూ అడ్వాన్స్‌ బుకింగ్‌ సిస్టమ్‌తో పాటు, నేరుగా వచ్చిన వారికీ టీకా ఇచ్చేలా మార్పులు చేసే అవకాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Next Story