తెలంగాణను పర్యావరణహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికను ప్రకటించారు. బుధవారం ముంబైలో జరిగిన 'క్లైమేట్ వీక్' సదస్సులో ప్రసంగిస్తూ, రాబోయే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఉండవని, వాటిని హైదరాబాద్ శివార్లకు లేదా గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. 2030 నాటికి తెలంగాణను 'వన్ ట్రిలియన్ డాలర్' ఎకానమీగా మార్చడమే లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం CURE, PURE, RARE అనే వ్యూహాత్మక చట్రాన్ని సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా, ORR మరియు రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా (PURE) తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగం జరుగుతోందని, 2034 నాటికి విద్యుత్ డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు రద్దు చేశామని, దీనివల్ల ఈవీల వాడకం పెరిగిందని సీఎం చెప్పారు. 2 లక్షల ఆటోలను పర్యావరణహితంగా మారుస్తున్నామని, ఆర్టీసీలో 3,500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రోను 200 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నామని పేర్కొంటూ, పర్యావరణ హితమైన తయారీ విప్లవం అవసరమని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.