నల్లమల అడవుల్లోకి పర్యాటకులకు నో ఎంట్రీ.. ఏకంగా 3 నెలల పాటు..
నేచర్ లవర్స్‌పై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆంక్షలు విధించింది. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైర్ రిజర్వ్ ఫారెస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
నల్లమల అడవుల్లోకి పర్యాటకులకు నో ఎంట్రీ.. ఏకంగా 3 నెలల పాటు..
అడవిలో పచ్చని చెట్లు, చల్లటి గాలి.. ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం కోసం ప్రకృతి ప్రేమికులు నిత్యం అడవుల బాట పడుతుంటారు. అయితే అలాంటి నేచర్ లవర్స్‌పై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆంక్షలు విధించింది. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైర్ రిజర్వ్ ఫారెస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వన్యప్రాణుల సంతానోత్పత్తికి సమయం కావడంతో 3 నెలల పాటు సఫారీ టూర్‌కి బ్రేక్ వేసింది. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు విధించబడ్డాయి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు ఈ సమయంలో జతకూడుతాయి.
ఈ సమయంలో ఎలాంటి అలజడి ఉండకూదనే ఉద్దేశంతో ఎన్‌టీసీఏ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో తిరిగి సఫారీ టూర్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు 3 నెలలపాటు అనుమతి లేదని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి వెల్లడించారు. వన్యప్రాణులు సంతానోత్పత్తికి జతకూడే సమయం కావడంతో 90 రోజుల పాటు సఫారీ టూరిజం ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని చెప్పారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 2,61,139 చదరపు కిలోమీటర్ల పరిధిలో నల్లమల అమ్రాబాద్ రిజర్వు టైగర్ (ఏటీఆర్)విస్తరించి ఉంది. ఇది భారత దేశంలోనే రెండో అతి పెద్ద రిజర్వు టైగర్ ప్రాంతం.
ప్రస్తుతం నల్లమలలో 23 పెద్దపులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ప్రత్యేక నిధుల కేటాయింపుతో అడవులు, వన్యప్రాణుల సంరక్షణ చేపడుతోంది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. నల్లమల ఫారెస్ట్‌లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వన్యప్రాణుల, క్రూర మృగాల సంచారం కూడా ఎక్కువే. పెద్దపులి ఏకాంత సమయంలో సంభోగంలో పాల్గొంటుంది. ఏ కొంచెం అలజడి అయినా అవి సంభోగంలో పాల్గొనవు. అది కూడా ఈ మూడు నెలల సమయంలోనే జత కడతాయి. మరోవైపు ఇదే సమయంలో పులులు చాలా ఆవేశంతో ఉంటాయి. ఈ క్రమంలోనే నల్లమలలో పర్యటనకు అనుమతులు నిలిపివేశారు.