Nizamabad: గంజాయి స్మగ్లర్ల ఘాతుకం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు.

By -  అంజి
Published on : 26 Jan 2026 12:57 PM IST

Nizamabad, Marijuana smugglers, attack, Excise constable Soumya, critical condition

Nizamabad: గంజాయి స్మగ్లర్ల ఘాతుకం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యపై స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మాధవనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి విధి నిర్వహణలో ఉన్న సౌమ్యపై స్మగ్లర్లు తమ కారుతో దూసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. ముందుగా కారుతో ఢీకొట్టిన దుండగులు, అనంతరం రివర్స్‌లో మరోసారి కారు ఎక్కించడంతో ఘటన తీవ్రతరమైంది. ఈ దాడిలో సౌమ్యకు ఛాతీ, కిడ్నీ, ప్లీహం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఒక కిడ్నీతో పాటు ప్లీహాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్‌ లోని నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. కారు అద్దెకు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ సిబ్బంది గుర్తించగా, వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఈ దారుణం జరిగింది. స్మగ్లర్ల కారులో నుంచి రెండు కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగినట్లు తెలిసింది. ఈ కేసులో ఐదుగురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

సోఫియాఖాన్, సోహైల్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, మతిన్, రహిల్, శిభా పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు మతిన్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీఐ స్వప్న నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ ఎక్సైజ్ సిబ్బంది ధర్నాకు దిగారు. సీఐ స్వప్నతో పాటు కానిస్టేబుల్ అమీద్‌పై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు. సౌమ్య చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. సౌమ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని ఎక్సైజ్ అధికారులు భరోసా ఇచ్చారు.

Next Story