రాష్ట్రంలో రూ.3,900 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తెలంగాణలో హైవేల డెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By Knakam Karthik
రాష్ట్రంలో రూ.3,900 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తెలంగాణలో హైవేల డెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పర్యటించిన గడ్కరీ.. రూ.3,900 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ఆదివాసీల గడ్డ అని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రోడ్డు మార్గాల వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణాన్ని కేంద్రం పెద్ద ఎత్తున చేపడుతోందని గుర్తుచేశారు. మెరుగైన రహదారులున్న దేశాలే అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు పొందుతాయని పేర్కొన్నారు. దేశ ప్రగతికి వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు అనే నాలుగు అంశాలు మూలస్తంభాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని చెబుతూ, రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టులను గడ్కరీ ప్రస్తావించారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు.
సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం, నాగ్‌పుర్ నుంచి విజయవాడ వరకు కీలకమైన కారిడార్ పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు భద్రాచలం, బాసర, మేడారం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానించనున్నట్లు తెలిపారు. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు రవాణా మరింత సులభతరం కానుందని అన్నారు.