పీఎఫ్ఐ కేసు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు
NIA searches in Telugu states in connection with PFI case. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసు దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దూకుడు పెంచింది.
By అంజి Published on 18 Sept 2022 10:26 AM ISTపాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసు దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా, జగిత్యాల పట్టణం, కర్నూలు, గుంటూరు, కడప నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో 23 బృందాలతో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూలు, కడప ప్రాంతాల్లో కూడా 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు బృందాలతో ఎన్‌ఐన దాడులు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోందన్న అనుమానంపై ఎన్ఐఏ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో అరెస్టైన వారితో పాటు పలువురు అనుమానితుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలోని పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ యూసుఫ్ ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో పీఎఫ్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తోందని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. మతకలహాలు సృష్టించేందుకు చురుకైన అతివాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలోనే భైంసా అల్లర్లతో సంబంధాలపై ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. విదేశాల నుంచి నగదు బదిలీ, బ్యాంకు ఖాతా లావాదేవీలు జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ విషయమై వారు విచారణ జరుపుతున్నారు.
నంద్యాలలో ఎన్‌ఐఏ సోదాలను నిరసిస్తూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గతంలో కూడా నంద్యాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుచ్చిరెడ్డి పాలంట్ ఇలియాస్, అతని స్నేహితుల ఇళ్లలోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహించనుంది. పలు రికార్డులను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఐఏ అధికారులు సోదాల సమయంలో మరెవరినీ అనుమతించడం లేదు. మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.