గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. వివరణ కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో చదువుతున్న రేణు శ్రీ అనే విద్యార్థిని బిల్డింగ్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
By అంజి Published on 9 Jan 2024 6:34 AM ISTగీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. వివరణ కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో చదువుతున్న రేణు శ్రీ అనే విద్యార్థిని ఐదంతస్తుల బిల్డింగ్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 5వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సుమోటోగా స్వీకరించింది. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యార్థిని రేణు శ్రీ చదువుకోవడం ఇష్టంలేకపోయినా.. తల్లిదండ్రుల బలవంతం మీద గీతం యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది. రేణు శ్రీ క్లాసులకు వెళ్ళకుండా బయట క్యాంపస్‌లో తిరుగుతూ ఎంజాయ్ చేసేది. ఆమె కదలికలను ఆమె స్నేహితులను అడిగి తండ్రి తెలుసుకునేవాడు. అనంతరం ఫోన్ చేసి మందలించే వాడు. ఒకవైపు చదువు ఇష్టం లేకపోవడం.. మరోవైపు ప్రతినిత్యం కుటుంబ సభ్యులు తన స్నేహితులకు ఫోన్ చేసి తన గురించి ఆరా తీయడం.. ఈ రెండు కారణాలతో రేణు శ్రీ తీవ్రమన స్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోబోయే ముందు కూడా రేణు శ్రీ స్నేహితురాలితో మాట్లాడింది. మీ కుటుంబ సభ్యులు నీ గురించి అడుగుతున్నారని స్నేహితురాలు చెప్పింది. స్నేహితురాలతో మాట్లాడుతూనే రేణు శ్రీ ఐదవ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
వార్తా నివేదికల్లోని అంశాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తడం ఆందోళన కలిగిస్తుందని కమిషన్ గమనించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. కళాశాల అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పోలీసు విచారణ, విచారణ ఫలితాలు, సంఘటనకు బాధ్యులుగా గుర్తించిన వ్యక్తులపై తీసుకున్న చర్యలు, అటువంటి బాధాకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యలు కూడా నివేదికలో చేర్చాలి అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
మీడియా కథనం ప్రకారం, ఆమె తోటి విద్యార్థులు ఆమెను ఆపమని కేకలు వేయడంతో బాధితురాలు విపరీతమైన చర్య తీసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ఆమెను ఇస్నాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆమెను "చనిపోయిందని" ప్రకటించారు. 18 ఏళ్ల విద్యార్థిని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా.