కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో చర్చ.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం: సీఎం రేవంత్‌

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను

By అంజి
Published on : 5 Aug 2025 6:46 AM IST

Kaleshwaram project, Assembly, CM Revanth, Telangana, JusticePCGhoseCommission

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో చర్చ.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం: సీఎం రేవంత్‌

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. కమిషన్ రిపోర్ట్‌ను విశ్లేషించడానికి నియమించిన ఉన్నతస్థాయి కమిటీ అందజేసిన సంక్షిప్త నివేదికపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మొత్తం మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో దాన్ని శాసనసభ, శాసనమండలి ముందు పెట్టి స్వేచ్ఛగా అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

“ఘోష్‌ కమిషన్‌ నివేదికలో చెప్పిన అన్ని అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు సమగ్రంగా వివరించడం జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ మార్చి నెల 31 వ తేదీన 665 పేజీలతో కూడిన సుదీర్ఘమైన నివేదికను ప్రభుత్వానికి అందించింది. దానిపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సమగ్రంగా విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక అందించింది. మొత్తం నివేదికతో పాటు అధికారుల కమిటీ సంక్షిప్త నివేదికను మంత్రిమండలి ఆమోదించింది.

మేం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రాజెక్టుపై న్యాయ విచారణ కోసం అనుభవం కలిగిన న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ నియమించాం. మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు, ఆనాటి నీటి పారుదల మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులు, ఎంతో మంది నుంచి సమగ్రమైన సమాచారం సేకరించిన మీదట నివేదిక ప్రభుత్వానికి అందజేశారు.

2007-08 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టగా, రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ప్రాజెక్టు పేరు, స్థలం మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారు. 2015-16 లో మొదలు పెట్టిన ప్రాజెక్టు 2018 లో పూర్తయినట్టు ప్రకటించారు. నిర్మించిన మూడేళ్లలోపు 2023 లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలిపోగా, అన్నారం, సుందిళ్ల పగుళ్లు రావడం, దానిపై ఆనాటి ప్రభుత్వ హయాంలోనే సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్ఏ ప్రతినిధి బృందం పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక అందజేసింది.

ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాల పునాదులపై వేసిన ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. కమిషన్ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. పూర్తిగా స్వతంత్ర న్యాయ కమిషన్ ఇచ్చిన నివేదిక. రాజకీయ కక్షలకు తావు లేదు..” అని చెప్పారు.

Next Story