నవ వధువు కిడ్నాప్.. పెళ్ళైన కొన్ని నిమిషాలకే..!

ఓ జంట పెళ్లి చేసుకుని వ‌స్తున్న కొన్ని నిమిషాల్లోనే వధువును కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2023 2:30 PM IST
Newly married bride, kidnap, Huzurabad, Crime news

నవ వధువు కిడ్నాప్.. పెళ్ళైన కొన్ని నిమిషాలకే..! 

ఓ జంట పెళ్లి చేసుకుని వ‌స్తున్న కొన్ని నిమిషాల్లోనే వధువును కిడ్నాప్ చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్ళైన ఓ జంటను ఓ 15 మంది వ్య‌క్తులు వెంబ‌డించారు. ఆ జంట‌ను అడ్డ‌గించి, పెళ్లి కూతురును త‌మ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్‌లోని అంబేద్క‌ర్ చౌర‌స్తా వ‌ద్ద బుధ‌వారం అర్ధ‌రాత్రి జరిగింది. కొండ‌గ‌ట్టులో వివాహం చేసుకుని కారులో బ‌య‌ల్దేరింది ఓ జంట. వారి కారును మ‌రో కారు వెంబ‌డించింది. 15 మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హుజురాబాద్ అంబేద్క‌ర్ చౌర‌స్తా దగ్గర ఆ నవదంపతులు ఉన్న కారును అడ్డ‌గించారు.

అనంత‌రం న‌వ వ‌ధువును బ‌ల‌వంతంగా లాక్కెళ్లి త‌మ కారులోకి తీసుకెళ్లిపోయారు. వ‌రుడిపై కూడా కొంద‌రు దాడి చేశారు. దీంతో వారి నుంచి త‌ప్పించుకునేందుకు వ‌రుడు పోలీసు స్టేష‌న్ వైపు ప‌రుగులు పెట్టాడు. వరుడు, వధువు ఇద్దరిది హనుమకొండ జిల్లాలోని మడికొండ గ్రామం అని తెలుస్తోంది. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో వధువు బంధువులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అపహరణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Next Story