ఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.15వేల జరిమానా, రెండేళ్లు జైలు
పోలీసులు న్యూఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు అమలు చేయనున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 3:49 AM GMTఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.15వేల జరిమానా, రెండేళ్లు జైలు
న్యూఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు కొందరు నిర్వాహకులు న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇప్పటికే అందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. అయితే.. పోలీసులు కూడా న్యూఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలుపెడతామని పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి రూ.15వేల జరిమానాతో పాటు.. రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి దొరికిని వారికి గరిష్టంగా రూ.10వేల ఫైన్‌తో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ఇక రెండో సారి పట్టుబడితే రూ.15వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెబెతున్నారు పోలీసులు. అంతేకాదు.. డ్రైవింగ్ లైనెన్స్ రద్దుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 సందర్భంగా వాహనదారులంతా అప్రమత్తంగా ఉండాలని.. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని హెచ్చరిస్తున్నారు. గతంలో రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండేవి.. కానీ ఈసారి 8 గంటలకే ప్రారంభం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు పలు సూచనలు చేశారు. కస్టమర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయొద్దని చెప్పారు. అంతేకాదు.. అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో రైడ్ నిరాకరించొద్దని సూచించారు. మరోవైపు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నగర పరిధిలోని ఫ్లై ఓవర్లతో పాటు పలు రహదారులను కూడా పోలీసులు మూసివేస్తారు.
ఇక వాహనదారులు కొందరు పెండింగ్ చలాన్లు డిసెంబర్ 31న పడినవి కూడా డిస్కౌంట్ ద్వారా చెల్లించుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి పోలీసులు ఒక అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. 31 న్యూఇయర్ వేడుకల్లో వేసిన చలాన్లపై రాయితీ ఉండదని చెప్పారు. డిసెంబర్ 25 తేదీ ముందు పడ్డ చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని చెప్పారు. ఆ తర్వాత విధించిన చలాన్లను వందశాతం కట్టాల్సిందే అని చెప్పారు పోలీసులు.