తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనుంది. ఆయా కంపెనీలు.. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జతపరచాలని టీజీబీసీఎల్ తెలిపింది.
కాగా తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఆ కంపెనీలపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన బ్రాండ్లను నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన అప్లికేషన్లను పది రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలని టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులపై కూడా నిర్ణయం తీసుకోనుంది.