తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లు

నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజినల్ రింగ్ రోడ్ కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

By అంజి  Published on  19 Dec 2023 8:00 AM IST
New green industrial zones, Telangana, CM Revanth

తెలంగాణ వ్యాప్తంగా త్వరలో కొత్త గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లు

హైదరాబాద్: విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నుండి 50 కి.మీ నుండి 100 కి.మీ లోపు కొత్త పారిశ్రామిక జోన్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లుతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన భూమి వ్యవసాయానికి పనికినిదై ఉండాలని, నివాస ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) వెలుపల, ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) లోపల 500 ఎకరాల నుండి 1000 ఎకరాల వరకు భూమిని కొత్త పారిశ్రామిక వాడలను స్థాపించడానికి గుర్తించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పరిశ్రమలకై సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకానివిగా ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల, రైతులకు నష్టం కలుగకుండా ఉండడంతోపాటు కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేవిధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, వాటిలో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఆ భూముల్లో ఎన్నింటిలో పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని కోరారు.

రాష్ట్రంలోని తొమ్మిది పూర్వ ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల, ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని తెలియజేసారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ ను కాకుండా సోలార్ పవర్ ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Next Story