హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్.. 15వేల కొత్త ఉద్యోగాలు

తెలంగాణలో కాగ్నిజెంట్ కంపెనీ భారీ విస్తరణకు సిద్ధం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2024 3:11 AM GMT
new cognizant centre,  hyderabad, cm revanth reddy,

 హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్.. 15వేల కొత్త ఉద్యోగాలు

తెలంగాణలో కాగ్నిజెంట్ కంపెనీ భారీ విస్తరణకు సిద్ధం అయ్యింది. ఐటీ రంగం దూసుకెళ్తున్న తరుణంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో కొత్త కంపెనీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 15వేల మందికి ఈ కొత్త కంపెనీ నిర్ణయం ద్వారా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్‌ను కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

కాగా.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు.. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌, కంపెనీ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త సెంటర్‌ ఏర్పాటుపై ఒప్పందం జరిగినట్లు సీఎంఓ తెలిపింది. గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్‌ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్‌ సీఈవో ఎస్‌.రవికుమార్‌ అన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలు అందిస్తుందని కాగ్నిజెంట్‌ సీఈవో ఎస్.రవికుమార్ చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. కాగ్నిజెంట్‌ కంపెనీ కొత్త సెంటర్‌ ఏర్పాటుతో ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థలు హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని సీఎం రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్‌కు తమ ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్‌ ఏర్పాటుతో వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తుందన్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Next Story