రాష్ట్రంలో కొత్త బార్ల మంజూరుపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బార్, సరూర్‌నగర్ మున్సిపాలిటీలో ఒక బార్‌కు నోటిఫికేషన్ ఇచ్చారు. మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్ మున్సిపాలిటీల్లోనూ ఒక్కో బార్ చొప్పున ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు.
జిహెచ్‌ఎంసి పరిధిలోని బార్లకు బెట్ స్లాబ్ ఫీజు రూ.40లక్షలు, జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.42లక్షలుగా నిర్ణయించినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. ఈ ఫీజు తిరిగి చెల్లించరని, 2బీ బార్లకు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈనెల 15 నుంచి జాన్ 6లోపు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆబ్కారీ అధికారులు తెలిపారు. కాగా ఎక్సైజ్ ద్వారా భారీగా ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు కూడా ఎక్సైజ్ శాఖ తిరిగి అనుమతులు ఇచ్చింది.