వణికిస్తోన్న 'కడెం'కు నిర్లక్ష్యపు గండం.. దిగువ గ్రామాల్లో భయాందోళనలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఓవర్ ఫ్లో అయ్యి.. గేట్లపై నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది.
By అంజి Published on 28 July 2023 6:15 AM GMTవణికిస్తోన్న 'కడెం'కు నిర్లక్ష్యపు గండం.. దిగువ గ్రామాల్లో భయాందోళనలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఓవర్ ఫ్లో అయ్యి.. గేట్లపై నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద నీరు దిగువకు ఉధృతంగా దూకుతోంది. వరద ఉధృతితో ప్రాజెక్టు కింద ఉన్న మైసమ్మ గుడి ప్రాంతంలో ప్రధాన కాలువకు గండిపడి కాలువ కొట్టుకుపోయింది. 7.063 టీఎంసీల మేర సామర్థ్యం కలిగి ఉన్న కడెం ప్రాజెక్టుకు.. మొత్తం 18 గేట్లు ఉన్నాయి.
వాస్తవానికి ప్రాజెక్టు కట్ట సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే. అయితే పరిమితికి మించి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం ఉదయం ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో.. 14 గేట్లు మాత్రమే పనిచేయడంతో వాటిని తెరిచారు. సాయంత్రానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్ల మరమ్మతులు చేసి.. అప్పటివరకు మొరాయించిన 2, 4, 6, 12 నెంబర్ల గేట్లలో 4, 6 నెంబర్ గల గేట్లను జేసీబీల సాయంతో అతి కష్టం మీద తెరిచారు. మిగతా 2, 12 గేట్లు మాత్రం తెరుచుకోలేదు. 16 గేట్ల నుంచి కిందకు నీరు విడుదలవుతోంది. ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.
ప్రాజెక్టు నిర్వాహణపై అశ్రద్ధ
కడెం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని.. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులు అంటున్నారు. కడెం ప్రాజెక్టుపై ప్రభుత్వం చూపుతున్న అశ్రద్ధపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెబుతున్నారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం వహించారని, దాని వల్లే ఇప్పుడు పరిస్థితి విషమంగా మారిందని అంటున్నారు. నిన్న ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని స్థానికులు అడ్డుకొని నిలదీశారు. మంత్రి అల్లోలతో పాటే ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కూడా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. జనం నిలదీయడంతో మంత్రి, ఎమ్మెల్యేకు నోట మాట రాలేదు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను మంత్రి అల్లోల ఆదేశించారు.
గోదావరి బేసిన్‌లో ఉన్న కడెం ప్రాజెక్టు నిర్లక్ష్యపు గండం పట్టుకుంది. ఏటా వరదలతో నిండే ప్రాజెక్టు నిర్వాహణ పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరం భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణికింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు గేట్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో ప్రజలతో పాటు ప్రాజెక్టు అధికారుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది 6 లక్షల క్యూసెక్కుల వరద రాగా... ఈ దఫా 4 లక్షల క్యూసెక్కులు వచ్చింది. అయితే గతేడాది ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ తనిఖీలు చేసి.. అదనంగా 5 గేట్లతో స్పిల్ వే కట్టాల్సిందేనని రిపోర్ట్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అదనపు స్పిల్‌వే కోసం రూ.500 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనాలు వేసి.. ఐదు గేట్లతో స్పిల్‌వే కోసం ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండే.. కానీ ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోలేదు. తాజా వరదలతో ప్రాజెక్టులో ఇబ్బందులు తలెత్తడంతో అధికారం యంత్రాంగం మొద్దు నిద్ర నుండి నిద్రలేచింది.
గతేడాది ఇదే పరిస్థితి
2022 జూలై చివరి వారంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడంతో డ్యామ్‌పై వరద నీరు ప్రవహించింది. డ్యామ్ పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) 700 అడుగులకు గాను 705 అడుగులకు నీరు చేరింది. 18 స్లూయిస్ గేట్లలో ఒకదానిని అధికారులు తెరవలేక పోవడంతో, అది పనిచేయక పోవడంతో డ్యామ్ నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం కూడా తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఈ గేటు పాడైపోయినా మరమ్మతులు చేయలేదు. వేలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని, నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడాన్ని బీజేపీ ఎంపీ సోయం బాబురావు తప్పుబట్టారు. డ్యామ్ ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని తట్టుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాజెక్టు దిగువన ఉన్న పలు గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. ఆనకట్ట కొట్టుకుపోతుందనే భయంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన తర్వాత హైదరాబాద్‌కు చెందిన 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం డ్యామ్ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించింది. భారీ వరదలు సంభవించినప్పుడు బయటకు వెళ్లేందుకు తగినంత అవకాశం ఉండేలా మరో ఐదు క్రెస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక డ్యామ్‌కి గండి పడిన చోట గేట్లు వేయాలని సూచించింది. అయితే సాంకేతిక బృందం తన నివేదికను సమర్పించినప్పటికీ, సూచనలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోలేదు.