ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం వల్ల దురదృష్టవశాత్తు శ్రీశైలం ఆలయాన్ని కోల్పోయామని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాశాఖ మంత్రి సురేఖ అన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గత పాలకుల హయాం నుంచి తెలంగాణ భక్తులు తిరుమలలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగానే తిరుమల నుంచి రాష్ట్రానికి నిధులు రావాలన్నారు. అధిక భక్తులు, రాబడి వస్తున్న తెలంగాణపై టీటీడీ దృష్టి సారించాలన్నారు.
తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతించాలని మంత్రి సురేఖ కోరారు. ఇవాళ శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని మంత్రి సురేఖ దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు.