Hyderabad: ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ? నేడు పాశమైలారం ప్రమాదస్థలికి NDMA
నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది.
By Knakam Karthik
Hyderabad: ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ? నేడు పాశమైలారం ప్రమాదస్థలికి NDMA
పాశమైలారం సించి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు దాటినా ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించాల్సి ఉంది. రాహుల్, రవి, వెంకటేశ్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, శివాజీల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐలా భవన్ వద్ద ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో 18 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 14 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను డీఎన్ఏ రిపోర్టు కోసం అధికారులు ల్యార్కు పంపించారు.
కాగా, సిగాచి పరిశ్రమను సందర్శించిన హైలెవల్ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సభ్యులు గత శుక్రవారం ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయం, కార్మికులు ఎంత మంది ఉన్నారు. పేలుడు జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అలాగే పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని ఆ బృందం పరిశీలించనుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్‌ఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది.