యువతిని వివస్త్రను చేసిన ఘటన.. సీరియస్‌గా స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ

మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు యువతిని వివస్త్రను చేసి వేధించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది.

By అంజి  Published on  9 Aug 2023 11:31 AM IST
national commission for women, Hyderabad, jawahar nagar incident

యువతిని వివస్త్రను చేసిన ఘటన.. సీరియస్‌గా స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ

హైదరాబాద్‌: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిచి వెళ్తున్న యువతి బట్టలు విప్పి వివస్త్రను చేసిన కేసులో నిందితుడు మారయ్యను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా యువతిని వివస్త్రను చేసి వేధించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. యువతిని విస్త్రను చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్‌.. ఈ ఘటన హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. దీనిపై డీజీపీని నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్‌.. వారంలోగా నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని కమిషన్‌ కోరింది.

మరోవైపు అయితే ఈ కేసులో నిందితుడికి సహకరించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈనెల 6న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ బస్ స్టాప్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై పెద్ద మారయ్య అనే కూలి పీకలదాకా మద్యం సేవించి.. ఆ మత్తులో యువతిపై చెయ్యివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి అతడిని నెట్టివేసింది. ఈ క్రమంలోనే మారయ్య విచక్షణ కోల్పోయి.. యువతిపై దాడి చేసి, బట్టలను చింపి వివస్త్ర చేసి 15 నిమిషాల పాటు యువతిని రోడ్డు మీద నగ్నంగా ఉంచాడు.

అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల కొందరు ఈ దుశ్చర్యను అడ్డుకోవాల్సింది పోయి ఫొటోలు, వీడియోలు తీస్తూ చిత్రం చూశారు. చివరికి కొందరు స్థానికులు ధైర్యం చేసి అడ్డుకొని యువతిపై కవర్లను కప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మారయ్య ఆ విధంగా యువతిపై దాడి చేసి బట్టలు చింపుతూ ఉంటే అతని తల్లి నాగమ్మ నివారించకుండా నిందితుడికి సహకరించింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు నిందితుడికి సహకరించిన తల్లి నాగమ్మను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

Next Story