నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటితో పోల్చితే తారకరత్న కొద్దిగా కోలుకున్నాడని.. డాక్టర్లు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మద్దతును కొద్దిగా తగ్గించారని, మందుల వాడకం కూడా కొద్దిగా తగ్గించారని అన్నారు. గుండె, కాలేయం పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని, న్యూరో విషయంలో కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అన్నింటికన్నా శుభపరిణామం ఏమిటంటే, తారకరత్న తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నాడని.. ఇది తమకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గుండె పనితీరులో మెరుగుదల ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు వైద్య నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ చేసిన తర్వాతే తారకరత్న ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సమేతంగా నిన్న ఆసుపత్రికి వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.