తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరారు. యూకే వెళ్లేందుకు కేటీఆర్ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సామాన్యుడిలా క్యూలో నిల్చున్నారు. సాధారణ ప్రయాణికులతో పాటు క్యూలో నిలబడి తనిఖీ ప్రక్రియను పూర్తి చేశారు. తనిఖీలు ముగించుకుని కేటీఆర్ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు. ఆయన ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
బుదవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కేటీఆర్ యూకే బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 13 వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో ఆయన సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన పెట్టుబడిదారులకు తెలియజేయనున్నారు.