Mulugu: ఆటోను ఢీకొట్టిన కంటైనర్, స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 7:46 AM ISTMulugu: ఆటోను ఢీకొట్టిన కంటైనర్, స్పాట్‌లోనే ముగ్గురు మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వాజేడు మండల కేంద్రానికి చెందిన కాకర్లపూడి సత్యనారాయణ రాజు (77), అతని భార్య సత్యవతి (70), కూతురు అనితను వైజాగ్ బస్సు ఎక్కించేందుకు రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో ఏటూరునాగారం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఏటూరునాగారం మండల కేంద్రం దగ్గర ఉన్న రొయ్యూరు వద్దకు రాగానే చత్తీస్‌గఢ్ వైపువెళ్తున్న కంటెయిన్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణరాజు, సత్యవతి దంపతులతో పాటు ఆటో డ్రైవర్ నాగరాజు స్పాట్‌లోనే చనిపోయారు. సత్యనారాయణరాజు కూతురుతోపాటు మరో ప్రయాణికుడు అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే 108కి కూడా కాల్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. అనిత పరిస్థితి సీరియస్‌గా ఉంది. దాంతో.. ఆమెను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అయితే.. ఆటోను ఢీకొట్టిన తర్వాత చత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న కంటెయినర్‌ను జగన్నాథపురం వద్ద స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు ఏటూరునాగారం పోలీసులు తెలిపారు.