హస్తం పార్టీకి షాక్‌.. సొంత గూటికి చేరుకున్న రామ్మోహన్ గౌడ్

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఏ నాయకుడు ఎప్పుడు, ఏ పార్టీలోకి వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

By అంజి  Published on  1 Nov 2023 1:15 PM IST
Muddagouni Rammohan Goud, BRS, Harish Rao, Telangana Polls

హస్తం పార్టీకి షాక్‌.. సొంత గూటికి చేరుకున్న రామ్మోహన్ గౌడ్

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఏ నాయకుడు ఎప్పుడు, ఏ పార్టీలోకి వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. నేతల పార్టీల మార్పుతో రాజకీయాలు వేడెక్కాయి. గత నెల 12న రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని రామ్మోహన్ గౌడ్ భావించారు. కానీ ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కలేదు. దీంతో రామ్మోహన్ గౌడ్ అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అయితే రామ్మోహన్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి హరీష్ రావు ముందు ఉద్యమ నాయకులకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను రామ్మోహన్ మోసం చేశారంటూ ఆరోపణలు చేశారు. రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ఆగ్రహంతో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు వెనుతిరిగి వెళ్ళిపోయారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు, కలిసి పని చేశామని అన్నారు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చానని, కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడని, ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి అని అన్నారు. రెండు సార్లు టికెట్ ఇచ్చామని, స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని, అయితే 11 మంది కార్పొరేటర్లు గెలిపించారని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని అన్నారు.

రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయన్నారు. పార్టీ ప్రతినిధిగా తాను ఇక్కడికి వచ్చానని, అందుకు తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందామని అన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని, డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు, అన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం అంటున్నాయని హరీష్‌ రావు పేర్కొన్నారు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.

Next Story