సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మందకృష్ణ మాదిగ
MRPS Chief Manda Krishna Madiga fires on CM KCR.రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2022 10:23 AM GMT
రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10 నుంచి అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. సీఎం కేసీఆర్‌తో రాజ్యాంగంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
పాలకులు తమ వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సరికాదన్నారు. నియంతృత్వ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దళితులపై కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని ఇంకా ఎన్ని రోజులు అనుసరించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని.. ఆ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని, సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనపై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య హక్కులు ప్రజలకు ఉంటే తమపై నిరసన వ్యక్తం చేస్తారని రాజ్యాంగాన్నీ మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని దుయ్య బట్టారు.