వివాదాల ముసుగులో పాలకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు
MP Revanth Reddy Fire On TRS and BJP. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వివాదాస్పదంగా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 18 Nov 2022 11:26 AM GMTతెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వివాదాస్పదంగా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రకటనలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయని.. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తమ అసమర్థతను కప్పిపుచుకుంటున్నాయని విమర్శించారు. వివాదాల ముసుగులో పాలకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఈడీ, ఇన్కమ్ టాక్స్, సీబీఐని ప్రయోగిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను టీఆర్ఎస్ ప్రయోగిస్తోందని అన్నారు. నచ్చని ప్రజా ప్రతినిధులను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడే వారిపై కేసులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.
వారిద్దరి చిల్లర పంచాయతీల చుట్టూ రాజకీయ చర్చ జరిగేలా చేస్తున్నారు. అసభ్య పదజాలంతో ప్రజల మనసులను కలుషితం చేసేలా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు అనే పదం కూడా కేసీఆర్ ను చూసి సిగ్గుపడుతుందని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు. ఈ కేసును సింగిల్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నాయకులు తనను సంప్రదించారని కల్వకుంట్ల కవిత స్వయంగా ఒప్పుకున్నారు. సీవీ ఆనంద్ తక్షణమే కవిత స్టేట్మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. వారిని ఎవరు సంప్రదించారో విచారణ చేసి అరెస్ట్ చేయాలని అన్నారు.
విచారణను కేవలం నలుగురు ఎమ్మెల్యేలకే పరిమితం చేస్తే కోర్టు ముందు మీరు కూడా దోషిగా నిలబడాల్సి వస్తుంది. సీఎం కేసీఆర్ స్వయంగా తన కూతురుని కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందన్నారు. వారి స్టేట్ మెంట్ ను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వం చర్చ కూడా చేయడం లేదని.. వడ్ల కొనుగోలుపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ పై చర్చకు రాకుండా చేస్తున్నారు. ఏ ఒక్క అంశంపై చర్చ జరగకుండా దాడులు, ప్రతిదాడులు తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడేందుకు రేపు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటిస్తాం. రైతు సమస్యలు, బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ సమాజం తమను తిరస్కరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలకు అర్ధమైందన్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దాడులు, ప్రతి దాడుల సంస్కృతికి కాంగ్రెస్ వ్యతిరేకం.. దాడులు ఎవరు చేసినా తప్పు తప్పే అని అన్నారు.