కేసీఆర్ సమర్థ పాలనకు నిరంతర విద్యుత్ సరఫరా ఓ చక్కని ఉదాహరణ : ఎంపీ కేకే
MP K Keshava Rao Speech in TRS Plenary.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమర్థ పాలనకు నిరంతర విద్యుత్ సరఫరా
By తోట వంశీ కుమార్ Published on 27 April 2022 12:24 PM ISTతెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమర్థ పాలనకు నిరంతర విద్యుత్ సరఫరా ఓ చక్కని ఉదాహరణ అని ఎంపీ కే కేశవరావు అన్నారు. తెలంగాణ అభివృద్ది ముందు ప్రతిపక్షాల అబద్దాలు నిలువవన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం తీరు దుర్మార్గమని మండిపడ్డారు. దేశం మార్పు కోరుకుంటోందని, దేశం అంతా కేసీఆర్ వైపు చూస్తోందన్నారు.
మాదాపూర్ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఎంపీ కేకే స్వాగతోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో అనేక పార్టీలు ఎంత వేగంగా పుట్టాయో అంతే వేగంగా కాలగర్భంలో కలిసి పోయాయని చెప్పారు. తెలంగాణ సాధన కోసం కూడా ఎన్నో పార్టీ లు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోకుండానే మాయమయ్యాయని, అయితే కేసీఆర్ పట్టుదల, మొండి తనం, నిజాయితీ, చిత్తశుద్ధి టీఆర్ఎస్ ను నిలిచి గెలిచేలా చేశాయని తెలిపారు.
కేసీఆర్ అసాధారణ ప్రతిభా పాటవాలు, అకుంఠిత దీక్షాదక్షతలతో పార్టీని ప్రబలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారని, అనేక అనుమానాలు, అవమానాల మధ్య కఠోరమైన లక్ష్యాన్ని సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్ తనకంటూ ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నందువల్లే ఇంత తక్కువ వ్యవధిలో మనం అద్భుత విజయాలు సాధిస్తున్నట్లు చెప్పారు.
విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన ప్రగతి ఒక్కటి చాలు కేసీఆర్ సమర్ధ పాలకుడని చెప్పడానికి అని ఎంపీ కేకే అన్నారు. తెలంగాణ అంధకారమవుతుందని విమర్శించిన వాళ్ల నోళ్లు ఇపుడు మూతపడ్డాయని, కరెంటు వెలుగులతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందన్నారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం కరెంటు కోతలతో సతమతవుతుంటే తెలంగాణ మాత్రం అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణ త్వరలోనే 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యానికి చేరుకుని చరిత్ర సృష్టించ బోతోందన్నారు.
గతంలో కాగితాలు, శిలాఫలకాలకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నం వల్ల ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. సాగు తాగునీళ్లకు కటకటలాడిన తెలంగాణ ఇపుడు జల భాండాగారంగా మారిందన్నారు. ఇక దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అసమర్ధ కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా తెలంగాణ సమాజం అండగా నిలబడుతుందన్నారు.