మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం..
Motkupalli Narasimhulu test coronapositive. తాజాగా బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
By తోట వంశీ కుమార్ Published on 18 April 2021 12:55 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరికి సోకుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. చికిత్స నిమిత్తం ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
టీడీపీ హయాంలో మోత్కుపల్లి మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. 2008లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం కొన్నేళ్లు టీడీపీలో కొనసాగిన ఆయన అనంతరం ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయన్ను టీడీపీ అప్పట్లో పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు.
కాగా.. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 1,29,637 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,093 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 15 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా మృతి చెందిన వారి సంఖ్య 1,824కి చేరింది. ఇక నిన్న 1,555 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,12,563 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.