Telangana: పెన్షన్లకు 8 లక్షల కొత్త దరఖాస్తులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన'లో కొత్త పెన్షన్ల కోసం 8 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
By అంజి Published on 9 Jan 2024 1:33 AM GMTTelangana: పెన్షన్లకు 8 లక్షల కొత్త దరఖాస్తులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన'లో కొత్త పెన్షన్ల కోసం 8 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 44 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. తాజాగా వచ్చిన వాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 52 లక్షలకుపైగా చేరుతుంది. వితంతువులు 1.90 లక్షలు, దివ్యాంగులు 1.20 లక్షలు, ఒంటరి మహిళలు 40 వేలు, బీడీ కార్మికులు 20 వేలు, డయాలసిస్ బాధితులు 16 వేలు, ఇతరులు 1.14 లక్షల మంది పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు. 57 ఏళ్లు దాటిన వారు దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద పెన్షన్ దరఖాస్తులను ఆహ్వానించింది.
ప్రస్తుతం సాధారణ పెన్షన్ రూ.2016, దివ్యాంగులకు రూ.3016గా ఉంది. వీటిని కాంగ్రెస్ సర్కారు వరుసగా రూ.4 వేలు, రూ.6 వేలకు పెంచుతామని చెప్పడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆసరా పథకంలో మొదట్లో 65 ఏళ్లు దాటిన వృద్ధులు పెన్షన్లకు అర్హులుగా ఉండేవారు. 2022 ఆగస్టు నుంచి అప్పటి ప్రభుత్వం దానిని 57 ఏళ్లకు తగ్గించింది. దీనికోసం 2019 నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొత్తగా పెన్షన్లను అమలు చేసింది. 2022 ఆగస్టు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటివరకు పెన్షన్లు రాలేదు. తాజాగా వారందరూ ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన పథకాలకు అర్హతను కలిగి ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక వెబ్ సైట్ లో ఆరు గ్యారెంటీల కోసం అభయహస్తం పథకం కింద దరఖాస్తులు ఇచ్చిన వారంతా తమకు ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన రసీదు పత్రంలోని దరఖాస్తు నెంబర్ ను ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.