కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం
Monkey pox reported in kamareddy district. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్ వ్యాధి
By అంజి Published on 25 July 2022 7:30 AM ISTతెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో వారిద్దరిని హైదరాబాద్‌లోని నల్లకుంటలో గల ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. స్పెషల్ వార్డులో వారికి చికిత్స చేస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. బాధితుల్లో ఒకరు ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చారు. ఈ నెల 20న జ్వరం రావడం, 23న శరీరంపై దద్దుర్లు రావడంతో చికిత్స కోసం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆ వెంటనే స్థానిక జిల్లా ఆరోగ్య అధికారుల నుండి వైద్య సహాయం కోరాడని, వారికి చికిత్స అందించడానికి వైద్యులు ఫీవర్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు.
సోమవారం.. ఫీవర్ ఆస్పత్రిలోని ఆరోగ్య అధికారులు అనుమానాస్పద మంకీపాక్స్ రోగి నుండి రక్త నమూనాలు, లెసియన్ ఫ్లూయిడ్, గాయాల క్రస్ట్‌లు, మూత్ర నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపనున్నారు. ''ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించాం. వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. అయినప్పటికీ ఆ ఆరుగురిని కూడా ఐసొలేషన్‌లో ఉంచాం. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆయన సూచనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతున్నాం. మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదని, దీని గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు.'' అని జీ శ్రీనివాసరావు తెలిపారు.
''మేం ఆ రోగిని ఐసోలేషన్‌లో ఉంచుతాం. రోగికి చికిత్సను అందిస్తాం. ప్రకృతిలో గాలిలో వ్యాపించే కోవిడ్‌లా కాకుండా, మంకీపాక్స్ దగ్గరి పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చాలా మంది మంకీపాక్స్‌ను పోలి ఉండే మశూచికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ పొందారు.'' అని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ తెలిపారు. మంకీపాక్స్ కేసు ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించబడుతుంది.