హైదరాబాద్: ఈ సంక్రాంతి సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు అధికంగా జరుగుతాయనే అంచనాలకు భిన్నంగా.. ఓ మోస్తరుగా సాగాయి. నూతన సంవత్సరం, దసరా, బోనాల పండుగల మాదిరిగానే సంక్రాంతి సందర్భంగా కౌంటర్ల వద్ద పొడవాటి క్యూలతో అధిక విక్రయాలు జరుగుతాయని దుకాణ యజమానులు అంచనా వేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోలలో బీర్, విస్కీ స్టాక్‌ల కోసం వారు అధిక అమ్మకాలను అంచనా వేసి మరింత ఇండెంట్ పెట్టారు.
అయితే హైదరాబాద్‌లో నివాసముంటున్న చాలా మంది ఉద్యోగులు పండుగను ఘనంగా జరుపుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అమ్మకాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పండుగ సీజన్‌లో ఓ మోస్తరు విక్రయాలు జరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మద్యం దుకాణాల యజమానులు తెలిపారు. చలి వాతావరణం కారణంగా ఈసారి బీర్ అమ్మకాల కంటే విస్కీ ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అటు తాటి కల్లు దొరుకుతుండంటంతో చాలా మంది మందుబాబులు తాళ్లలోనే కూర్చుంటున్నారు. దీంతో వైన్‌షాపులకు మద్యం ప్రియులు షాకిచ్చినట్టైంది.