ఈ నెల 10న ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష.. ఆ బిల్లు కోసమే

ఈ నెల 10న దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.

By అంజి  Published on  2 March 2023 5:17 PM IST
ఈ నెల 10న ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష.. ఆ బిల్లు కోసమే

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్టు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత మీడియాతో మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రెండుసార్లు హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయిందని అన్నారు. ఇంటర్నేషనల్‌ వుమెన్స్‌ డే మార్చి 8న దీక్ష చేపట్టాలనుకున్నామని, కానీ ఆరోజు హోలీ పండుగ ఉన్నందున 10వ తేదీన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ దీక్షకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ జనాభా గణన చేపట్టకపోవడం విచారకరమని, జనాభా గణనలో ఓబీసీ జనాభాను ప్రత్యేకంగా చేయాలని డిమాండ్‌ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కవిత సూచించారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని చెప్పారు. అలాగే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో త్వరలో తననూ అరెస్ట్‌ చేస్తారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కవిత స్పందించారు. బీజేపీ నేతలు చెప్పినట్లు అరెస్ట్‌లు చేస్తే.. ఇక దర్యాప్తు సంస్థలు ఎందుకని ప్రశ్నించారు.


Next Story