జీడీపీ పెంచ‌మంటే.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు పెంచారు : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Protest Against Hike in Fuel Prices.గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2022 7:42 AM GMT
జీడీపీ పెంచ‌మంటే.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు పెంచారు : ఎమ్మెల్సీ కవిత

గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గురువారం సికింద్రాబాద్‌ చీఫ్ రేషనింగ్‌ ఆఫీస్‌ వద్ద టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. జీడీపీ పెంచ‌మంటే కేంద్ర ప్ర‌భుత్వం గ్యాస్, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు పెంచింద‌ని విమ‌ర్శించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను రోడ్ల‌పైకి తెచ్చిన ఘ‌న‌త మోదీ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు అనేక మాట‌లు చెబుతున్నార‌ని అయితే.. ధాన్యం సేక‌ర‌ణ‌పై మాత్రం మాట్లాడ‌డం లేద‌న్నారు.

ఆయిల్‌ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని మండిప‌డ్డారు. మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా ఉద్య‌మాల‌కు దిగిరాక త‌ప్ప‌ద‌న్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని ఎమ్మెల్సీ క‌విత‌ స్పష్టం చేశారు.

Next Story