జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత

42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

By Knakam Karthik
Published on : 4 Aug 2025 12:11 PM IST

Telangana, Mlc Kavitha, Bc Reservations, 72 Hour Hunger Strike, Telangana Politics

జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత

42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్‌ అంబేడ్కర్‌, పూలే, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు, తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌కు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి’’ అని కవిత అన్నారు.

బీసీల హక్కులు సాధించేవరకు 72గంటల దీక్షను కొనసాగిస్తా. హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో.. ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తాను. బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించను. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ చెప్పింది చెప్పినట్లు అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్‌లో సైతం దీక్షకు దిగుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం. గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే 42శాతం రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకోవాలని చూస్తుంది. రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్తుంది. బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ సంతకాలు పెట్టడం లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేయవద్దు. బీసీలకు హక్కులు వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి..అని కవిత పేర్కొన్నారు.

Next Story