ఆ విషయం రేవంత్ గురువు చంద్రబాబుకు బాగా తెలుసు: కవిత
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్‌లో నిరసన తెలిపారు.
By అంజి Published on 10 Dec 2024 12:58 PM ISTఆ విషయం రేవంత్ గురువు చంద్రబాబుకు బాగా తెలుసు: కవిత
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్‌లో నిరసన తెలిపారు. ''గ్రాండ్‌గా ఉండే విగ్రహాన్ని తీసేసి బీద తల్లి విగ్రహాన్ని పెట్టామని సీఎం అంటున్నారు. అంటే రాష్ట్రంలో కూలీ చేసే మహిళలు ఎప్పటికీ అలాగే ఉండాలనా మీ ఉద్దేశం? సెక్రటేరియట్‌లో మీరు పెట్టింది కాంగ్రెస్ తల్లి విగ్రహమే. ఉద్యమకారులతో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడలేదు. ఈ విషయం రేవంత్ గురువు చంద్రబాబుకు బాగా తెలుసు'' అని వ్యాఖ్యానించారు.
వేలాది మంది ఉద్యమకారులు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని కవిత తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఎందుకు అంగీకరించలేదని కవిత ప్రశ్నించారు. బతుకమ్మ పండుగను విగ్రహంలో ఎందుకు చేర్చలేదన్నారు. తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామని చెప్పారని, కళాకారుల జాబితాలో మహిళలు ఎక్కడ, విమలక్క, మల్లు స్వరాజ్యం, సంధ్య వంటి వారు కనిపించలేదా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ పేద ప్రజలు ఎప్పటికీ అలాగే ఉండాలా? మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైంది? అని నిలదీశారు. స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని కవిత అన్నారు.