చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఏమైంది?: ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 11:28 AM IST
MLC Kavitha,  Kishan Reddy, BJP, BRS,

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఏమైంది?: ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందంటూ మండిపడ్డారు. పార్లమెంట్‌లో బీజేపీకి భారీ మెజార్టీ ఉన్నా.. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ఆమె ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం ఉంది.. అందుకే దేశంలో 14 లక్షల మంది మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కిందని అన్నారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని.. అందుకోసం చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. చట్టం తీసుకురాకపోతే ఎన్నటికీ పూర్తిస్థాయిలో మార్పు సాధ్యం కాదని అన్నారు. అయితే.. బీఆర్ఎస్‌ అభ్యర్థులను ప్రటించడంపై కిషన్‌రెడ్డి చేసిన విమర్శలకు కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తాయో చూద్దాం అని అన్నారు. కిషన్‌రెడ్డి బీఆర్ఎస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. టికెట్లు రాని అభ్యర్థులను బీజేపీ తమ పార్టీలోకి లాగే ప్రయత్నాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళా ప్రాతినిథ్యానికి ముడిపెట్టకూడదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. పార్లమెంట్‌ సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలకు మహిళలకు రిజర్వే చేయాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు.

మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ కేసీఆర్ సీట్లు ఇవ్వడం ద్వారా ఓటమిని అంగీకరించినట్లు అయ్యిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీ భయంతోనే కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. లోక్‌సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని దీక్షలు చేసినవారు.. తెలంగాణలో మహిళలకు 7 చోట్ల మాత్రమే అవకాశం ఇచ్చారని అన్నారు కిషన్‌రెడ్డి. 33 శాతం అంటే 7 సీట్లేనా అని బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.

Next Story