గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చింది.. అయినా పథకాలు ఆగవు: జీవన్‌రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 6:01 AM GMTగత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చింది.. అయినా పథకాలు ఆగవు: జీవన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటి అమల్లో నిమగ్నం అయ్యింది. ఇప్పటికే రెండింటిని అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీనికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల సమయంలో రైతుబంధు నిధులు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుబంధు నిధులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
సాగుచేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అంటే రైతుబంధు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు డిసెంబర్ చివరి లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనుందని వెల్లడించారు. ఆదివారం రోజున సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధరణిలో తప్పొప్పులను పరిశీలించి, కొంత మంది భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందల ఎకరాలు సాగు భూములుగా చూపించి రైతుబంధు సాయం పొందతున్నారని చెప్పారు. దీనిపై పునరాలోచించి సాగు చేసే భూములకు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున సాయం అందించేలా చూస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు.
మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఖజానాను మొత్తం ఖాళీ చేసి అప్పులకుప్పగా రాష్ట్రాన్ని మార్చిందని చెప్పారు. గత ప్రభత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందని అన్నారు. అయినా కూడా కేవలం ఆరు గ్యారెంటీలే కాదు.. ప్రజా సంక్షేమ పతకాలను ఎక్కడా ఆపబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రకటించారు.