తెలంగాణ, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..
MLC Election Schedule Released. రెండు తెలుగు రాష్ట్రాలుఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి.
By Medi Samrat
రెండు తెలుగు రాష్ట్రాలు మరో ఎన్నికకు సిద్దమవుతున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి(ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి గాను కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందుకు సంబంధించి పిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొంది. మార్చి 14వ తేదీన పోలింగ్.. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఇక తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. పలు పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి. తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానంతో పాటు నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. నల్గొండ - ఖమ్మం - వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్ ను.. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానానికి గాను మాజీమంత్రి చిన్నారెడ్డిని ఖరారు చేసింది.
ఇక అధికార టీఆర్ఎస్ వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రకటించింది. త్వరలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని తెలిపింది. ఇక ఏపీ విషయానికొస్తే.. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు.