సెక్యూరిటీని కొట్టిన హోంమంత్రిపై చర్యలు తీసుకుంటారా?: రాజాసింగ్
సెక్యూరిటిని హోంమంత్రి చెంప దెబ్బ కొట్టిన వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 7:37 AM IST
సెక్యూరిటీని కొట్టిన హోంమంత్రిపై చర్యలు తీసుకుంటారా?: రాజాసింగ్
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహమూద్ అలీ సహనం కోల్పోయిన తన సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నారు. అయితే.. హెంమంత్రి సెక్యూరిటీ గార్డుని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. దాంతో అది వైరల్‌గా మారింది. సెక్యూరిటీని చెంప దెబ్బ కొట్టిన హోంమంత్రిపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
హోంమంత్రి మహమూద్ అలీ మంత్రి తలసాని పాల్గొన్న సమావేశానికి వెళ్లారు. అక్టోబర్ 6వ తేదీన తలసాని పుట్టిన రోజు కావడంతో ఆయనకు విషెస్ చెప్పేందుకు దగ్గరకు వెళ్లారు. ఆలింగనం చేసుకుని.. వెంటే తీసుకొచ్చిన పుష్పగుచ్చం ఇవ్వాలని చూశారు. కానీ అది దగ్గర లేకపోవడంతో అసహనంతో సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. జనాలు ఎక్కువగా ఉండటం వల్ల హోంమంత్రి చెప్పిన విషయం సరిగ్గా వినపడలేదు కావొచ్చు..ఏంటి సార్ అంటూ ముందుకు వచ్చారు. దాంతో.. ఆగ్రహానికి గురైన హోంమంత్రి మహమూద్ అలీ ముందూ వెనుక చూసుకోకుండా సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సంఘటనపై ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారి పట్ల హోంమంత్రి వ్యవహరించిన తీరుని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటిని హోంమంత్రి చెంప దెబ్బ కొట్టిన వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అధికారిపై చెంపదెబ్బ కొట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ చేసింది తప్పుగా చెప్పుకొచ్చారు. అందుకుగాను హోంమంత్రిపై కేసు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఒక సాధారణ పౌరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే.. పోలీసులు వేగంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని చెప్పారు. అలాగే హోంమంత్రి తనకు సెక్యూరిటీ సిబ్బంది పుష్పగుచ్చం ఇవ్వలేదని బహరింగంగా చేయి చేసుకున్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ డీజీపీ హోంమంత్రిపై చర్యలు తీసుకుంటారా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.