సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరతానన్న జగ్గారెడ్డి

MLA Jaggareddy responds to CM KCR announcement on job notifications.అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ ఉద్యోగాల‌ భ‌ర్తీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 10:26 AM GMT
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరతానన్న జగ్గారెడ్డి

అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ ఉద్యోగాల‌ భ‌ర్తీ పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ప‌లువురు విప‌క్ష నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై వ్య‌క్తిగ‌తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు చెప్పారు. రేపు సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు అపాయింట్ మెంట్ కోర‌నున్న‌ట్లు జ‌గ్గారెడ్డి తెలిపారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మాట్లాడారు. ఏడేళ్లుగా నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ త‌రుపున అనేక సార్లు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన‌ట్లు చెప్పారు. ఏ పార్టీ కూడా రాజకీయ లబ్ది లేకుండా పనిచేయదన్నారు. యూత్ కాంగ్రెస్‌, ఎన్ఎస్‌యూఐ ఆధ్వ‌ర్యంలో అనేక పోరాటాలు చేశామ‌న్నారు. ఈ రోజు రాష్ట్రంలో మంచి ప‌నులు జ‌రుగుతున్నాయంటే అందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హ‌యాంలో నిర్మించిన ఇందిర‌మ్మ ఇళ్ల మాదిరిగా ఇప్పుడు ఇల్లు క‌ట్టుకునే వారికి రూ.3ల‌క్ష‌లు సాయం చేయాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. బిస్వాల్ క‌మిటీ నివేదిక ప్ర‌కారం త్వ‌ర‌లోనే మిగిలిన ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 11, 103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నార‌ని.. వారిని రెగ్యుల‌రైజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా తక్షణమే నోటిఫికేషన్ ఇస్తున్న‌ట్లు తెలిపారు. కాగా.. కొత్త‌గా భ‌ర్తీ చేయ‌నున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7 వేల కోట్ల అద‌న‌పు భారం ప్ర‌భుత్వం పై ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని స్ప‌ష్టం చేశారు.

Next Story