విద్యుత్‌ ఉద్యోగిపై దాడి కేసు.. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఉద్యోగిపై మంగళవారంనాడు దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఏఐఎంఐఎం నేతపై మాదన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

By అంజి  Published on  31 Jan 2024 4:06 AM GMT
MLA Jaffar Hussain, dharna, AIMIM leader, TSSPDCL, lineman

విద్యుత్‌ ఉద్యోగిపై దాడి కేసు.. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే 

హైదరాబాద్: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఉద్యోగిపై మంగళవారంనాడు దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఏఐఎంఐఎం నేతపై మాదన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా ఎస్సార్‌టీ కాలనీలోని ఎంఐఎం కార్పొరేటర్ మెహఫరా ఇంటికి వెళ్లారు. అయితే ఒక ఏడాది నుంచి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని చెల్లించాల్సిందిగా కోరారు. అయితే ఆ సమయంలో విద్యుత్ సిబ్బందితో మెహఫరా సోదరుడు షఫత్ అలీ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఉద్యోగిపై షఫత్ అలీ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ లైన్‌మెన్‌ కమ్‌ బిల్‌ కలెక్టర్‌ రమేష్‌బాబు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 323, 427 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ యూనియన్లు డిమాండ్ చేశాయి.

మరోవైపు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ లైన్‌మెన్‌ కమ్‌ బిల్‌ కలెక్టర్‌పై దాడి చేసిన కేసులో ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఏ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) నేత షఫత్‌ అలీని అదుపులోకి తీసుకున్న తర్వాత యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌ నిరసనకు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం యాకుత్‌పురాలోని ఎస్‌ఆర్‌టీ కాలనీలో లైన్‌మెన్ కమ్ బిల్ కలెక్టర్ రజినీష్ బాబు మెహఫరా అసభ్యంగా ప్రవర్తించడంతో ఇదంతా ప్రారంభమైందని మెరాజ్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న షఫత్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని రజినీష్ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. లైన్‌మెన్‌పై చర్యలు తీసుకోకుండా, ఎఐఎంఐఎం నాయకుడు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినట్లు పోలీసులు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనంతరం నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఐఎంఐఎం ఎమ్మెల్యే, ఇతరులు చేసిన ధర్నా తరువాత, లైన్‌మెన్‌పై కూడా కేసు నమోదు చేయబడింది.

Next Story