ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం
MLA Eatala Rajender Father passed away.భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
By తోట వంశీ కుమార్
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య కన్నుమూశారు. మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాదులోని ఆర్విఎం ఆస్పత్రి మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 104 సంవత్సరాలు. మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమారైలు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
మల్లయ్య భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఈటల స్వగృహానికి తరలించారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లయ్య మృతితో కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను కడసారి చూసేందుకు, ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.
టీఆర్ఎస్‌లో సుదీర్ఘ కాలం పని చేసిన ఈటల రాజేందర్ ను భూ అక్రమాల ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తప్పించడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరుపున విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కలిసివచ్చే వారందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈటల రాజేందర్ భార్య జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయన అక్కడే ఉండి ఉపఎన్నిక కోసం పనిచేస్తున్నారు.
కాగా.. తన తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే ఈటల ఆస్పత్రికి వెళ్లారు. మంగళవారం అక్కడే ఉన్నారు. రాత్రి తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వెళ్లారు.