ఆ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్‌లా వ్య‌వ‌హ‌రించారు

ములుగు జిల్లాలోని దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్ర‌వారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులు సందర్శించారు

By Medi Samrat  Published on  30 Aug 2024 5:14 PM IST
ఆ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్‌లా వ్య‌వ‌హ‌రించారు

ములుగు జిల్లాలోని దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్ర‌వారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులు సందర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రజలకు హామీ ఇస్తున్నాం.. మార్చి 2026 లోపు వంద శాతం దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తాం.. అదే నెలలో సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామ‌న్నారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్‌లా వ్యవహరించారన్నారు. ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందన్నారు.

ప్రాజెక్ట్ ల పేరుతో 1.81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చుపెట్టారని.. 14 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉంచారని వెల్ల‌డించారు. కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టులు కట్టారని.. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడమే మా లక్ష్యం అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆరోపించారు. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు. సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు, 60 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసి.. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామ‌న్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారన్నారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్‌ఘ‌ఢ్ ను ఒప్పిస్తామ‌న్నారు.

ఉత్తుత్తి హామీలు మేము ఇవ్వం.. చెప్పింది చేసి తీరుతామ‌న్నారు. ఫాంహౌజ్‌లో కూర్చొని నిర్ణయాలు తీసుకోమన్నారు. 24 గంటలు ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటామ‌న్నారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తామ‌ని చెప్పారు. ధరలు పెరగడంతో భూసేకరణ ఇబ్బందిగా మారిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిణి నియమిస్తున్నామ‌ని.. ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను నియమించామని తెలిపారు.

Next Story