వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని కులగణన సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. ప్లానింగ్ కమిషన్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,54,77,554 గా ఉందని.. ఇందులో మొత్తం కుటుంబాలు 1,12,15,134 ఉన్నాయని తెలిపారు. ఇందులో బీసీల జనాభా 1,64,09,179 మంది ఉన్నారని ఇది మొత్తం జనాభాలో 46.25 శాతం ఉందని తెలిపారు. అలాగే ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారని.. ఈ సంఖ్య మొత్తం జనాభాలో 17.43 శాతం, ఎస్టీలు 37,05,929 మంది ఉండగా మొత్తం జనాభాలో 10.45 శాతం ఉందని తెలిపారు.
అలాగే ముస్లీంలను రెండు వర్గాలుగా విభజించారని అందులో బీసీ ముస్లింలు 35,76,588 ఉండగా.. 10.85 శాతం, ఓసీ ముస్లింలు 8,80,424 మంది ఉండగా.. 2.48 శాతం అని.. మొత్తం ముస్లిం జనాభా తెలంగాణలో 12.56% శాతంకు చేరుకున్నట్లు తెలిపారు. అలాగే ఓసీల జనాభా శాతం 15.79% ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కులగణనకు సంబంధించిన నివేదికపై సోమవారం కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపి.. తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. అదే రోజు అసెంబ్లీలో కులగణన నివేదికపై సభ్యులతో చర్చించి.. నివేదికకు ఆమోదం తెలుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.