రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు.
గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81 వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిజామాబాద్ లో 3 రోజులపాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆయన ప్రారంభించారు. 2 లక్షల వరకూ రైతు రుణాలు మాఫీచేశామన్నారు.
త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా అన్నదాతల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. అటు ‘భూభారతి’ చట్టాన్ని పకడ్బందీగా అమ లు చేస్తామని, ధరణితో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం చందంపేట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.